August 20, 2016

పుష్కరాలు ఎలా వచ్చాయంటే

పుష్కరాలు ఎలా వచ్చాయంటే.. :

సృష్టి ఆరంభ సమయంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోరతపస్సు ఆచరించి, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తుందిలుడు పరమానందభరితుడై తనకు ఈశ్వరుడిలో శాశ్వత స్థానం కల్పించమని అర్థించాడు. అందుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలునికి శాశ్వతస్థానం కల్పించాడు. ఆవిధంగా మూడున్నర కోట్ల తీర్థాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. కావున పుష్కరుడయ్యాడు. పుష్కరుడు అంటే పుణ్యజలం మరియు పోషించేవాడని కూడా అర్థం ఉంది. సృష్టి నిర్మాణక్రమంలో బ్రహ్మదేవునికి జలంతో అవసరం ఏర్పడగా, జలాధికారియైన పుష్కరుని తనకు ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుని చతుర్ముఖుడు కోరుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించడంతో పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలో ప్రవేశించాడు. ఒక సందర్భంలో సకల జీవరాశిని పునీతం చేసేందుకు ప్రాణులకు జీవనాధారమైన జలాన్ని ఇవ్వాల్సిందిగా బృహస్పతి బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలివెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషరాశి మొదలు 12 రాశుల్లో ప్రవేశించినపుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పూర్తిగాను, మిగతా రోజుల్లో మధ్యాహ్న సమయంలో బృహస్పతి అధిపతిగా ఉన్న నదిలో పుష్కరుడు కొలువై ఉంటాడు. ఆ కారణంగా బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి.


ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరం వస్తుందంటే.. :

1. మేషరాశి : గంగానది
2. వృషభ రాశి : రేవా నది
3. మిథున రాశి : సరస్వతీ నది
4. కర్కాటక రాశి : యమునా నది
5. సింహ రాశి : గోదావరి నది
6. కన్య రాశి : కృష్ణా నది
7. తులా రాశి : కావేరి నది
8. వృశ్చిక రాశి : భీమారథీ నది
9. ధనూ రాశి : పుష్కరవాహిని (తపతి)
10. మకర రాశి : తుంగభద్రా నది
11. కుంభ రాశి : సింధూ నది
12. మీన రాశి : ప్రాణహితా నది 
Previous Post
Next Post

0 comments: